నాన్న.
*నాన్న ఎవరు??* బ్రహ్మదేవుడు చాలా బిజీగా తల రాతలు రాసే పనిలో ఉన్నాడు. ఇంతలో నేను, భూమి మీదకు వెళ్ళను అని మారాం చేయడం మొదలుపెట్టాను. “భూమి మీద నాకు ఎవ్వరూ తెలీదు. నేను ఎలా బతకగలను? అని అడిగాను. నువ్వేం భయపడకు. నిన్ను కాచి కాపాడటానికి నా అంశగా ఒక అమ్మను తయారుచేశాను. ఆమె కడుపులో నిన్ను పుట్టిస్తా” అన్నాడు బ్రహ్మదేవుడు. “అయితే సరే, కానీ నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఏడవటం మొదలుపెడతా. అప్పుడు మీరు నా ఇబ్బందిని తొలగించాలి” అనే షరతు పెట్టాను. దానికి బ్రహ్మా, “సరే నీకు మాటలు రానంత వరకు బ్రహ్మా విష్ణు మహేశ్వరులం ముగ్గురు నీకు సహాయం చేస్తాం” అన్నాడు. “మరి, ఆ తర్వాత చెయ్యరా?” అని అడిగా “అదేం లేదులే. నీకు మాటలోచ్చాకా నీకో మహా మంత్రం భోదిస్తాం. నీకు ఏ కష్టం వచ్చినా, ఒక్కసారి ఆ మంత్రం పఠిస్తే తప్పకుండా నీకు సహాయం దొరుకుతుంది.” అని చెప్పాడు బ్రహ్మా. మళ్ళీ ఇంకేదో అడగబోయే లోపల ఆ పరబ్రహ్మ, తన బెడ్రూం బాల్కనీ లోంచి నన్ను కిందకి త్రోసేశాడు. ఎలా వచ్చి చేరానో తెలియదు గానీ, ఆసుపత్రి బెడ్ మీద మా అమ్మ పక్కన వచ్చిపడ్డాను. అమ్మ పక్కన హాయిగా నిద్రపోతున్న నన్ను, ఓ పెద్దమనిషి తన చేతిలోకి తీసుకున్నాడు. భయమేసి, ...