భాగ్య-చోటు
అన్నం తిన్నాం.
కాసేపు చల్ల గాలిలో అలా నడుద్దామని బయటకి వచ్చాను.
ఏవేవో జ్ఞాపకాలు.
గతం నన్ను తరుముకుంటూ నా వెనుకే వచ్చి ఆగినట్లనిపించింది.
అదేంటో చల్ల గాలి మన గతాన్ని మోసుకొస్తుందేమో అనిపిస్తుంది.
కన్నీళ్లు ఆనకట్టని తెంచుకుని జర జరా కిందకి కారాయి.
నడక ముగించుకుని ఇంటికి చేరుకున్నాను.
పాప మంచం మీద పడుకుని ఆకాశంలోకి చూస్తూ వుంది.
బుజ్జి కొండ: నాన్నా! రా పడుకుందాం.
నేను: ఉమ్మా! వచ్చేసా...
బుజ్జి కొండ: నాన్న, కథ చెప్పు.
నేను: నాకు రావమ్మా, అమ్మని అడుగు.
బుజ్జి కొండ: చెప్పు నాన్న, నువ్వ అసలు చెప్పవ్.
నేను: అమ్మ బాగా చెప్తుందమ్మా, అమ్మ చేత చెప్పించుకో.
అంతలోనే వాళ్ళ అమ్మ వచ్చి తన పక్కన పడుకుంది.
బుజ్జి కొండ: అమ్మా, నాన్నని కథ చెప్పమంటే చెప్పట్లా!!!
తను: మీ నాన్న చెప్పడు, అన్నీ లోపలే దాచుకుంటాడు.
బుజ్జి కొండ: నాన్నా! దాచుకోకు నాన్నా, బయటకి తీయి.
నేను: హాహా! నీకు ఆడుకోడానికి తమ్ముడు కావాలన్నావా?
బుజ్జి కొండ: హా!
నేను: మరి కళ్ళు మూసుకుని త్వరగా పడుకో.
బుజ్జి కొండ: నేను పడుకోకపోతే తమ్ముడు రాడా?
నేను: ఆహా! రాడు. త్వరగా పడుకునే పిల్లల్ని చూసి వాళ్ళకే తమ్ముళ్ళని ఇస్తాడు దేవుడు.
బుజ్జి కొండ: అవునా?
నేను: హా, లేటుగా పడుకునే వాళ్ళకి ఇవ్వడు.
బుజ్జి కొండ: ఐతే పడుకుంటా, కథ చెప్పు.
తను: హాహా! నీ అతి తెలివి తేటలు దాని దగ్గర పని చేయవు.
బుజ్జి కొండ: చెప్పు నాన్నా.
నేను: అమ్మని అడుగు.
బుజ్జి కొండ: చెప్పమ్మా!!!
తను: తప్పదు గా, మొన్న శివాజీ కథ చెప్పానా, గుర్తుందా!
బుజ్జి కొండ: హా,
తను: శివాజీ వాళ్ళ అమ్మ పేరేంటి?
బుజ్జికొండ: జిజియా భాయ్
తను: గుడ్, రోజు ఉదయాన్నే 4 గంటలకి శివాజీ ని లేపి, స్నానం చేయించి, వడిలో పడుకోబెట్టుకుని ఏం చెప్పేది.
బుజ్జి కొండ: రామాయణం.
తను: మళ్ళీ గుడ్. అలా ఒకరోజు శివాజీ, కొలనులో చూసిన మొసలి గుర్తొచ్చి, ఈరోజు మొసలి కథ చెప్పమ్మా అని అడిగాడు. అప్పుడ్డు వాళ్ళ అమ్మా, రామాయణాన్ని మధ్యలో ఆపడం ఇష్టం లేక అందులోనే మొసలి కథని కలిపి చెప్పింది. ఆ కథ చెప్తా ఇపుడు.
నేను: వావ్! ఇంటరెస్టింగ్.
తను: మధ్యలో ఎవరైనా మాట్లాడితే వంద గుంజిళ్ళు తీయాలి.
నేను: మూతి మీద వేలు వేసేసుకున్న.
బుజ్జి కొండ: నువ్వు చెప్పమ్మా!
తను:
---------------------------------------------------జిజియా భాయి: వాల్మీకి మహర్షి ఆశ్రమంలో... సీతా దేవి కుటీరంలో నుంచి ఏడుపులు వినిపించాయి. అవి విని మిగిలిన పిల్లలు కూడా ఏడవటం మొదలుపెట్టారు, ఏమైందా అని వాల్మీకి మహర్షి లోనికి వెళ్లి సీతా దేవిని అడగగా...
--------------------------------------------------------సీతా దేవి: "కుమారులు ఇరువురూ ఈరోజు నదిలో స్నానం చేయించుచుండగా కోతి పిల్లని చూసారు. దాని కథ చెప్పమని ఏడుపు అందుకున్నారు."
వాల్మీకి మహర్షి: చెప్పేస్తే సరిపోలే సీతమ్మా.
సీతా దేవి: కానీ అందులో రాముల వారు కూడా ఉండాలంటున్నారు స్వామి.
వాల్మీకి మహర్షి: ఆహా! అలానా. ఇక్కడికి వచ్చి కూర్చొండ్రా కూనలు.
లవ కుశలు వాల్మీకి మహర్షి ఎదురుగా వచ్చి కూర్చున్నారు.
వాల్మీకి మహర్షి: ఒకనాడు అయోధ్యలో... తమ్ముళ్ళతో ఆడుకుంటున్న రామయ్యని చూసి, దశరధుడు వశిష్ట మహర్షితో...
దశరధుడు: మహర్షి, రాముడు అంతఃపురములో తమ్ముళ్ళతో ఆడుకుంటున్నాడు. తనకి బయట ప్రపంచం తెలియాలి. మనుషుల స్వభావాలు పరిచయం కావాలి. ప్రతి ఒకరు మంచివారు కాదని, మనసులో కీడు తలచుతూ పైకి నవ్వుతు నటించే నవ్వులు తెలియాలి, స్వలాభం కోసం మనిషిని నమ్మించి, ఎలా వంచన చేస్తారో తనకి కధలుగా చెప్పండి.
-------------------------------------------------------------------వశిష్ట మహర్షి: అలాగే ప్రభూ, రేపు సూర్యోదయానికి రాముని, తన తమ్ముళ్ళతో సరయు నదికి తీసుకపోయి, అక్కడ నా ఆశ్రమంలో కొన్ని రోజులు నీతి కధలు బోధిస్తాను.
దశరధుడు: మంచిది, కానీ త్వరగా ముగించుకుని తీసుకు రండి. తనని చూడకుండా నేను ఎక్కువ రోజులు ఉండలేను. మరొక విషయం, ఇలా వాళ్ళని తీసుకువెళుతున్నట్టు మహారాణులకి తెలియనివ్వద్దు. వారు ఒప్పుకోరు.
వశిష్ఠ మహర్షి: అలాగే ప్రభూ.
మరు నాడు ఉదయం, ఇంకా సూర్య కిరణాలూ అయోధ్యని సమీపించక మునుపే వశిష్ఠుడు నలుగురు పిల్లల్ని లేపి రధం ఏసుకుని సరయు నదీ తీరానికి బయల్దేరాడు.
రాముడు: మహర్షి, ఇంత పొద్దున్నే మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు.
వశిష్ఠ మహర్షి: నా ఆశ్రమానికి. మీరు కొన్ని రోజులు అక్కడే వుంది కొన్ని విద్యలు అభ్యసించవలసి ఉంటుంది. మీ తండ్రి గారే మిమ్మల్ని తీసుకువెళ్ళమని ఆజ్ఞాపించారు. మీ అమ్మలకి కూడా మీ తండ్రి గారు ఈపాటికే ఈ విషయం చెప్పేసి వుంటారు.
రాముడు: అయ్యో! వారు చింతించు చుంటారేమో కదా మహర్షి!
వశిష్ఠ మహర్షి: తప్పదు రఘు నందన! మీరు విద్యలన్నీ బాగా అభ్యసిస్తే వాళ్లే సంతోషిస్తారు.
రాముడు: అలాగే మహర్షి, తప్పకుండా.
వశిష్ఠ మహర్షితో సహా నలుగురూ సరయూ నదిలో స్నానం ఆచరించి, మహర్షికి పాదాభివందనం చేసి ఎదురుగా కూర్చున్నారు. ఇపుడు నేను మీకు ఒక నీతి కథ బోధిస్తాను. మీరూ అందులోని నీతిని గ్రహించి నాకు చెప్పాలి.
నలుగురు: అలాగే గురువు గారు.
వశిష్ఠ మహర్షి:
కొన్ని రోజుల క్రితం వరకు ఇక్కడే ఒక కోతి పిల్ల ఉండేది. దాని కథ మీకు చెబుతాను. మనం కూర్చున్న ఇదే ప్రదేశంలో ఒక ఆడ కోతి, మరో మగ కోతికి జన్మనిచ్చింది. అనారోగ్యం కారణంగా ఆ ఆడ కోతి త్వరగానే మరణించింది. చనిపోయే ముందు తన బిడ్డ కి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు అని పదే పదే చెబుతూవుండేది. ఇది జరిగిన కొంత కాలానికి ఒక ఆడ మొసలి, నది వరదలో కొట్టుకుని ఇక్కడికి వచ్చింది. ఈ ప్రదేశాన్ని చూసి అది మంత్ర ముగ్దురాలైంది. ఈ పచ్చదనం, ఇక్కడి జంతువులూ, పక్షులు, ఆహ్లాదంగా అనిపించాయి. దాని కన్ను ఒక రోజు, చెట్టు కొమ్మల పై వుండే కోతి పిల్ల పై పడింది. అది నీళ్లు తాగడానికి వచ్చేటప్పుడు వేటాడాలని కాచుకుని చూసేది. కానీ కోతి ఎపుడు ఒకే దగ్గర నీళ్లు తాగేది కాదు. కొన్ని రోజులు అయ్యాక ఇంకా లాభం లేదనుకుని ఒక ఉపాయం ఆలోచించింది. ఆ కోతితో స్నేహంగా మెలిగి ఎలాగైనా దాన్ని చంపాలని అనుకుంది.
---------------------శివాజీ: అమ్మా, మొసలి కోతిని ఎందుకు చంపాలనుకుంది, నీటిలోని చేపలు బానే దొరుకుతాయి కదా!!!
జిజియా భాయి: ఈ సందేహమే రామయ్యకు వచ్చింది. విను...
రాముడు: మహర్షి, అసలు మొసలి కోతిని ఎందుకు చంపాలనుకుంది?
-------------------------------
వశిష్ఠ మహర్షి: మంచి ప్రశ్నే, రామా! విను, ఆ మొసలికి ఒక ప్రేమ కథ వుంది. ఒక మంచి బలమైన మగ మొసలిపై మనసు పారేసుకుంది. వెళ్లి విషయం చెప్పింది. అపుడు ఆ మగ మొసలి...
మగ మొసలి: నేను వీరుడని, ఇప్పటి వరకు వందకు పైగా జింకలను, పదికి పైగా సింహలను, ఒకసారి ఏనుగును చంపాను. అలాంటి నన్ను పెళ్లాడాలంటే కనీసం ఒక కోతి గుండెకాయ అయినా తెచ్చి ఇవ్వు
అని షరతు పెట్టింది.
కావున, ఆ కోతి గుండెకాయ కోసం ఎప్పటినుంచో ఆ మొసలి ఎదురు చూస్తుంది.
ఒక రోజు ఆ సంధర్భం వచ్చింది. కోతి నీళ్లు తాగడానికి మొసలి వున్న చోటుకి దగ్గరకి వచ్చింది. మొసలి కోతిని చంపేద్దాం అనుకుంది. నెమ్మదిగా కోతి వైపు కదిలింది. కానీ కోతి చాలా చలాకీగా ఉండడం గమనించింది. ఒకవేళ తను దాడి చేసినా, పొరపాటున కోతి తప్పించుకుంటే, కోతి జాగ్రత్త పడుతుంది, జీవితంలో మళ్ళీ తనకి ఆ అవకాశం రాదు అని మెదడుకు పదును పెట్టింది. తన ప్రేయసి దగ్గరకి కోతిని తీసుకెళ్లి, తన కళ్ల ఎదురుగా చంపితేనే బావుంటుందని భావించి... తన నాలుకను తనే కొరుక్కుని కోతికి వినిపించేలా ఏడవడం మొదలు పెట్టింది.
కోతి: ఏమైంది?
మొసలి: రాయి గుద్దుకుంది. రక్తం పోతుంది. నొప్పిగా వుంది. నాకు కొంచెం మెచ్చుటకులు తెచ్చి పెడతావా?
కోతి: ఇది క్రూర మృగం. దీనితో నాకెందుకు?
మొసలి: నీకు అమ్మ లాంటిదానిని, తెచ్చి పెట్టు నాయన.
కోతి: ఆకులేగా, తీసుకొచ్చి ఇచ్చేద్దాం.
కోతి వెళ్లి ఆకులని తీసుకొచ్చి మొసలికి ఇచ్చింది.
మొసలి: బాబు, కొంచెం రాయి తో నలిపి పసరు నోటి దగ్గర రాయి, నీకు పుణ్యం ఉంటుంది.
కోతి మొసలి చెప్పినట్టే చేసింది.
మొసలి: నాకు చాలా సహాయం చేసావ్, నీ పేరేంటి నాయన. మీ అమ్మ నాన్నలకు నా కృతఙ్ఞతలు తెలియజేయి.
కోతి: నాకేం పేరు లేదు, నాకు అమ్మ నాన్న లేరు. ఇంక నేను వెళ్తున్నాను.
మొసలి: అయ్యో అవునా! నా పేరు భాగ్య శ్రీ. ఇక్కడే వుంటాను.
నీకు అమ్మ లాంటి దానిని. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను మర్చిపోకు. ఇంతకీ నువ్వు ఎక్కడ వుంటున్నావ్?
కోతి: ఆ పెద్ద మర్రి చెట్టు మీద.
భాగ్య శ్రీ: మంచిది. ఇక్కడికి వచ్చిన అప్పుడల్లా కనిపిస్తూ వుండు.
కోతి: అలాగే.
మరుసటి రోజు.
కోతి నీళ్లు తాగడానికి నదీ తీరానికి రావడాన్ని భాగ్య శ్రీ గమనించింది. పరుగున కోతి దగ్గరకు వెళ్లి...
భాగ్య శ్రీ: నాన్న, ఇక నుంచి నీ పేరు చోటు. నేనే పెట్టా. ఎవరైనా అడిగితె అదే చెప్పు.
కోతి: నాకెందుకు పెట్టారు?
భాగ్య శ్రీ: నువ్వు నా కొడుకువు కధా, బిడ్డకి తల్లేగా పేరు పెట్టాలి.
ఆ మాటకి ఆ కోతికి కంట్లో నీళ్లు తిరిగాయి. చిన్నప్పటినుంచి తను అమ్మ ప్రేమకి దూరం అయ్యాడు. నా అనే వాళ్ళు ఎవరూ లేకుండా పెరిగాడు. ఇపుడు ఒకరు వచ్చి తనని కొడుకులా దగ్గరకి తీసుకుంటుంటే మనసులో పట్ట రాని సంతోషం వేసింది.
కోతి: అమ్మా!
భాగ్య శ్రీ: నాన్నా!!
కోతి: నాతో ఇంతకుముందు ఎవరూ ఇలా మాట్లాడలేదమ్మా, రోజంతా ఆడుకోవడం, రాత్రికి పడుకోవడం. ఇదే నా జీవితం. మాట్లాడడానికి, ఉన్నానో పోయానో చూడ్డానికి, తిన్నానో లేదో అని అడిగేవారు ఎవరూ లేరమ్మా.
భాగ్య శ్రీ: ఎందుకు లేరు, ఇక నుంచి నా చోటుకి ఈ భాగ్య శ్రీ ఉంటుంది.
చోటు: చాలా థాంక్స్ అమ్మా.
భాగ్య శ్రీ: అమ్మ కి థాంక్స్ ఏంటి రా! తిన్నావా!!
చోటు: తినేశానమ్మా.
భాగ్య శ్రీ: ఏం తిన్నావమ్మా?
చోటు: నేరేడు పళ్ళు.
భాగ్య శ్రీ: బావున్నాయా?
చోటు: హా, బావున్నాయమ్మా.
భాగ్య శ్రీ: ఈరోజు నుంచి నా దగ్గరే పడుకుందువ్ రా, నా పొట్ట మీద పడుకో .
చోటు: వడ్డులేమ్మా.
భాగ్య శ్రీ: రా నాన్న, అమ్మ దగ్గర భయమేంటి.
చోటు: సరే.
భాగ్య చోటుని దగ్గరకి తీసుకుని నా బుజ్జి కొండా అని ముద్దు పెట్టి, తన పొట్ట పై పడుకోబెట్టుకుంది. నిజానికి ఇపుడు రెండు గుండెలు చాలా దగ్గరగా వున్నాయి. ఒక దానిలో ప్రేమ వుంది, మరొక దానిలో కుట్ర వుంది. కానీ రెండిటిని రెండు వేరు వేరు అవసరాలు దగ్గర చేసాయి. గమనిస్తున్నారా.
రాముడు: గమనిస్తున్నాం, గురువర్యా.
ఇద్దరు దగ్గర అయ్యారు, ఒకరు అనుబంధాన్ని చూస్తుంటే, మరొకరు అవసరాన్ని చూస్తున్నారు. కొనసాగించండి.
వశిష్ఠ మహర్షి: రోజులు గడిచాయి. అవకాశం కోసం ఒకరు చూస్తున్నారు. అనుబంధ మాయలో ఒకరు కూరుకుపోయారు. చోటు రోజు తను తిని రకరకాల పండ్లను వాళ్ళ అమ్మకి తీసుకుని వచ్చేవాడు. అవి తింటున్న అమ్మని చూస్తూ అవి కోయడానికి తను పడిన కష్టాలు, తన శరీరానికి తగిలిన దెబ్బలు మరిచిపోయేవాడు. అలానే భాగ్య శ్రీ అవి తింటూ... ఈ పండ్లు ఎంత రుచిగా వున్నాయి. ఇవే ఇంత రుచిగా ఉంటే రోజు ఇవే తినే ఈ కోతి గుండెకాయ ఇంకెంత రుచిగా ఉంటుంది అని మనసులో అనుకుంటూ ఉండేది. అనుభందం బాగా పెరిగింది. అమ్మని విడిచి చోటు వుండలేనంతగా. ఒక్క రోజు కూడా మాట్లాడకుండా వుండలేనంతగా. ఎక్కడ వున్నా అమ్మ ఏం చేస్తుందో అని తలుచుకోకుండా వుండలేనంతగా. చివరకి ఒక రోజున.
భాగ్య శ్రీ: బుజ్జి కొండా!! నేను ఇంకా వేరే చోటుకి వెళ్ళాలి రా.
చోటు: ఎందుకమ్మా?
భాగ్య శ్రీ: ఇక్కడ ఈ వడ్డున చేపలు దొరకడం లేదు. తిండికి బాగా ఇబ్బంది అయిపోతుంది. అవతలి వైపు నది వడ్డున నా బంధువులు వున్నారు, నాకు పెళ్లి కుదిరింది. మీ నాన్న గారు కూడా వున్నారు. ఇంకా నేను వెళ్ళాక తప్పదు. నువ్వేమో చిన్నపటినుంచి ఇక్కడే వుండే వాడివి, నిన్ను రమ్మంటే నువ్వేం అంటావొ అని భయం. ఈ అమ్మతో పాటుగా వచ్చేయి బుజ్జి కొండా.
చోటు: అక్కడ నాకు ఎవరూ తెలియరు కాదమ్మా. పైగా కొత్త ప్రదేశం. కానీ నువ్వు లేకుండా నేను ఉండలేను.
భాగ్య శ్రీ: నీకేం కాదమ్మా, అక్కడ నేను వుంటాను. ఇంకేం కావాలి.
చోటు: మనం ఎప్పటికి ఇలాగె ఉంటామా అమ్మ?
భాగ్య శ్రీ: ఉంటాం నాన్న. ఎప్పటికి నువ్వే నా బుజ్జి కొండ వి.
చోటు: సరే అమ్మ, వస్తాను. ఎలా వెళదాం.
భాగ్య శ్రీ: నువ్వు నా వీపు పై కూర్చో నాన్న, నేను నిన్ను తీసుకెళ్తాను.
చోటు: మరి నువ్ నన్ను మోయగలతావా అమ్మా!!!
భాగ్య శ్రీ: ఎం పర్లేదు అమ్మ, నేను తీసుకెళ్తాను.
చోటు: సరే అమ్మ.
వశిష్ఠ మహర్షి : భాగ్య శ్రీ, తన వీపు పై చోటు ని ఎక్కించుకుని నిదానంగా ఈదడం మొదలుపెట్టింది.
అపుడే చోటు మనసులో ఎదో కీడు శంకించడం మొదలుపెట్టింది. గుర్తుంచుకోండి కుమారులారా!!! ప్రయాణాలు ప్రారంభించేటప్పుడు ఎపుడైనా మనసులో కీడు శంకిస్తే ఒకసారి ఆగి, మనం వెళ్తున్న ప్రదేశం, మనం నమ్మిన మనుషులు, వెళ్తున్న మార్గాన్ని ఒకసారి పునః సమీక్షించుకోవాలి. చోటు ఎం పట్టించుకోకుండా గుడ్డిగా నమ్మి సంకన ఎక్కి కూర్చున్నాడు. తన చావుని వాటేసుకుని పట్టుకున్నాడు.
నది మధ్యలోకి వెళ్ళాక, భాగ్య శ్రీ తన ప్రేమ కథని చోటు కి చెప్పడం ప్రారంభించింది. ఒక కోతి కోసం తను ఎంత వెతికింది, ఎంత కష్టపడితే తను దొరికాడో అంతా చెప్పింది. చోటు కి అనుమానం కలిగింది.
చోటు: ఇపుడు నా గుండెకాయ కోసం ఇన్ని రోజులు ప్రేమని నటించావా?
భాగ్య శ్రీ: అవును.
చోటు: నువ్వు కాదు అనుంటే, నేనే తీసుకోమని చెప్పేవాడిని అమ్మా.
భాగ్య శ్రీ: తూచ్, ఐతే కాదు. హాహా, ఇంకిప్పుడు నువ్ ఏం చేయలేవు లే. మధ్యలోకి వచ్చాము.
చోటు: ఎలా చంపాలనుకుంటున్నావ్?
భాగ్య శ్రీ: అదే ఆలోచిస్తున్నాను రా, అంటూ ఒక్కసారిగా నీళ్ళలోకి వెళ్ళిపోయింది. అయినా నీకు చెప్పి చంపుతాననుకున్నావా.
చోటు ఆ నీళ్లలో మునిగి కొట్టుకుపోయి కొద్దీ సేపటికి పైకి తేలాడు. భాగ్య శ్రీ నెమ్మది గా వెళ్లి, చచ్చిన చోటు పీక పట్టుకుని తన ప్రియుడు వుండే దగ్గరికి తీసుకెళ్లింది. చోటు గుండె వుండే ప్రదేశాన్ని చీల్చి గుండె ని బయటకి తీసి, పుచ్చకాయల ముక్కలుగా కొరికి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఆలింగం చేసుకుని ఒక్కటయ్యారు. ఈ కధ ముగిసింది. రా కుమారులారా మీరేమి నేర్చుకున్నారో చెప్పండి.
రాముడు: ఇన్నాళ్లు అంతఃపురంలో ఉండడం వలన మనుషుల స్వభావాలు పూర్తిగా అర్ధం చేసుకోలేకపోయాను. చివరకి అమ్మా అని పిలిచిన గొంతుని కూడా నలిపేసే మనుషులు వున్నారని నాకు తెలియలేదు గురువర్యా.
లక్ష్మణుడు: నేను ఆ చోటు స్థానంలో ఉంటే, దగ్గర్లో ఏది వుంటే అది తీసుకుని భాగ్య శ్రీ ని చంపేసేవాడిని.
వశిష్ఠ మహర్షి: నిజానికి భాగ్య శ్రీ, అవసరానికి నటించింది అని చెప్పినప్పుడే చోటు చనిపోయాడు. ప్రాణాలు పోలేదంతే.
భరతుడు: వ్యక్తుల స్వభావాలను ఎలా అర్ధం చేసుకోవాలి.
వశిష్ఠ మహర్షి: అది చాలా కష్టం. మనిషి మనసులో ఏముందో పైన చూసి తెలుసుకోలేము. అది అనుభవం మీద అలవాటవుతుంది. గుర్తొస్తే పలకరించే వాళ్ళకి, గుర్తు తెచ్చుకుని పలకరించేవాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఒక రాతి బొమ్మకి, రక్తపు దేహానికి ఉన్నంత తేడా.
శత్రుజ్ఞ: మనిషికి జీవితాంతం తోడుగా ఉండేది ఎవరు?
వశిష్ట మహర్షి: నిజానికి ఎవరూ కాదు, తన సొంత నీడ కూడా చీకటిలో తనను విడిచి వెళ్ళిపోతుంది. తన దేహం తప్ప ఒక మనిషికి తనది అని చెప్పుకునేది ఏది లేదు.
రామ: అమ్మా?
వశిష్ఠ మహర్షి:
మొదటి నెలలో..........
వాంతులతో...
రెండవ నెలలో.......
సంతోషముతో,
మూడవ నెలలో.......
మైకముతో..
నాలుగవ నెలలో.......
పుల్లని పదార్థాలతో.....
5వ నెలలో.......
తలనొప్పితో.
6వ నెలలో......
కడుపునొప్పితో..
7వ నెలలో.......
శ్రీమంతపు గాజుల సవ్వడితో..
8వ నెలలో........
కంగారుతో...
9వ నెలలో.......
భయంతో..
10వ నెలలో.......
మరుజన్మతో ........భరించలేని బాధను భరించి మనకు జన్మను ఇచ్చే అమ్మకు
మనము ఈ జన్మంతా ఊడిగం చేసినా తక్కువే! అమ్మను కంటనీరు పెట్టించకుండా
చూసుకోవడం ఒక్కటే మన కనీస ధర్మం, మనం తనకి కృతజ్ఞత కలిగి వుండాలే తప్ప, తను మనకి కాదు. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా కుమారులారా!
రామ: జీవిత సత్యాలు బోధించండి గురువర్యా.
వశిష్ఠ మహర్షి: దానికి ఇంకా సమయం వుంది. ప్రస్తుతానికి అల్పాహారం సేవిద్దాం పదండీ.
వాల్మీకి మహర్షి: కూనలు, విన్నారు గా కోతి, రామ కథ. ఇంక కనులు మూసి పడుకోండి.
సీతా దేవి: నేను జో కొడతాను, పడుకోండి కుమారులారా.
వాల్మీకి మహర్షి: మరీ, నేను వెళ్ళొస్తాను సీతమ్మ, ఆరోగ్య మస్తు.
సీతా దేవి: అలాగే స్వామి.
జిజియా భాయ్: అలా ఆరోజు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో అందరూ ప్రశాంతంగా నినిద్రపోయి. మొసలి కథ నచ్చిందా!
శివాజీ: నచ్చింది అమ్మా, రా ఇంక కాసేపు ఆడుకుందాం.
తను: అలా వాళ్లిద్దరూ కాసేపు ఆడుకుని, టిఫిన్ తినడానికి వెళ్లారు. ఇంక పడుకో.
బుజ్జి కొండా: మన ఇంట్లో తులసి మొక్క పేరు భాగ్య శ్రీ కదా.
తను: హా !
బుజ్జి కొండా: వేరే పేరు పెట్టొచ్చు కదా!
తను: ఏమే!
బుజ్జికొండ: నాకు నచ్చలేదు.
తను: భాగ్య శ్రీ మంచి పేరే. మనం ఈ కధ చోటు వైపు నుంచి చూసాం. భాగ్య శ్రీ వైపు నుంచి తెలీదు కదా!!!
బుజ్జికొండ: నువ్వు ఎవరి వైపు నాన్న!
నేను: నేను మీ అమ్మ వైపు. ఇంక పాడుకోమ్మా. నువ్వు రోజూ త్వరగా ఒక వారం రోజులు పడుకున్నావ్ అనుకో, నైన్ మంత్స్లో తమ్ముడు/ చెల్లి వచ్చేస్తారు.
బుజ్జికొండ: అవునా! ఐతే పడుకుంటా.
కొద్ది సేపటి తరువాత...
తను: కథ చెబుతుంటే అటు తిరిగి పడుకున్నావ్. ఏడ్చావా?
నేను: లేదు.
తను: నీకు ఇష్టం అంటే ఆమెతో మాట్లాడు.
నేను: తను బావుంటే చాల్లే. మళ్ళీ నేనేందుకు. పడుకో.
తను: అన్నీ మనసులోనే పెట్టుకో. ఎం చెప్పకు.
నేను: నాకు తను ఎప్పటికి అమ్మే. నాకు చాలా ఇష్టం. తన మీద నాకు కోపం లేదు. తను చేసింది కరెక్టా కదాని నేను ఆలోచించను. రోజు దేవుడికి దణ్ణం పెట్టుకునేటపుడు తను కూడా బావుండాలని కోరుకుంటా. కానీ ఇంక తనతో మాట్లాడాను.
తను: ఎం సాధించడానికి!
నేను: సాధించడానికి కాదు, తన వల్ల నేను చావుని చూసాను. నా గుండె ఏడుపు నేను చాలా సార్లు విన్నాను. నేను వెళ్లి తనతో మాట్లాడితే నా మనసు నన్ను ఒప్పుకోదు. తనని నా బ్రెయిన్ ఒప్పుకున్నా, గుండె ఒప్పుకోదు. అది బావుండడం కోసం నేను బ్రెయిన్ ని బాధ పెట్టక తప్పదు.
తను: ఒకే మనిషికి చెందిన రెండు వేరు వేరు అవయవాలు భిన్నంగా ఆలోచించడం నేను ఎక్కడ చూడలేదు.
నేను: నన్ను చూసావ్ గా డార్లింగ్. సర్లే కానీ, ఏంటి మరి ఇపుడు.
తను: నోరుమూసుకుని పడుకో.
నేను: అంతేనా!!!
తను: అంతే.
నేను: గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్ బేబీ.
తను: పక్కన పడుకుని ఎవడూ స్వీట్ డ్రీమ్స్ అని చెప్పడు.
నేను: నేను చెప్తాగా.
బుజ్జికొండ: (మనసులో) ఐ హేట్ యూ భాగ్య శ్రీ.
--------------------------------------------------------------------
భాగ్య- చోటు: గుడ్డిగా నమ్మితే, పిచ్చిగా ప్రేమిస్తే, అందరూ మంచివారే అనుకుంటే చివరికి ఎవరికైనా ఈ గతే పడుతుంది.
తుడిచేయడానికి తన జ్ఞాపకాలు ఏమి నల్ల బోర్డ్ మీద చాక్ పీస్ తో రాసుకున్న రాతలు కాదు కదా...
నమ్మకం అనే ఉలితో.. ప్రేమ అనే చేతితో... నా గుండె గోడలపై చెక్కుకున్న సువర్ణాక్షరాలు...
నేను బ్రతికి ఉన్నంత కాలం వాటిని .. చేరుపలేను.
ప్రేమింపబడడం ఒక వరం.
నేను ప్రేమిపబడ్డాను అని భావించిన తొలి వ్యక్తి తోనే, నా నమ్మకం తప్పని తెలిసాక, మనుషులంటేనే విరక్తి కలిగింది.
ముఖ్యంగా నా మీద నాకే ద్వేషం మొదలైంది.
నేనే తనని నమ్మకుండా ఉండి ఉంటే.. నా జీవితంలో ఏడుస్తూ పడుకున్న రోజులు ఉండేవి కాదేమో...
Comments
Post a Comment