స్నేహం-1

పది ఏళ్ళ వయస్సులో ఇద్దరు స్నేహితుల మధ్యన సంభాషణ.
గౌతమ్: హరిణి మనం ఎప్పటికీ ఇలానే స్నేహితులుగా ఉంటామా!!!
హరిణి: హా! ఎందుకు ఉండం!
గౌతమ్: నువ్వు వేరే స్కూల్ కి వెళ్లవు గా?
హరిణి: ఆహా! వెళ్ళను.
గౌతమ్: నన్ను విడిచిపెట్టి వెళ్ళకు హరిణి, నీతో నే గా నేను ఆడుకునేది.
హరిణి: వెళ్లనని చెప్పనా!
గౌతమ్: సరే. (కళ్ళు మూసుకుపోయేంతలా నవ్వూతూ)
మూడు సంవత్సరాల తరువాత వేసవి సెలవుల్లో....
హరిణి: మా అమ్మ కి బదిలీ అయ్యింది. ఇక మేము మా నాన్న దగ్గరికి వెళ్తున్నాం.
గౌతమ్: మీ అమ్మ వెళ్తారులే, నువ్ మీ అమ్మమ్మ దగ్గర ఉండి ఇక్కడే చదువుకోవచ్చు కదా!
హరిణి: ఆమ్మో! మా అమ్మ లేకుండా నేను ఉండలేను. అయినా ఇన్ని రోజులు సెలవలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూసిందే నాన్న దగ్గరకి వెళ్లొచ్చు అని. అలాంటిది ఎపుడు నాన్న దగ్గరే ఉండే అవకాశం వస్తే ఎలా వదులుకుంటాను.
గౌతమ్: మరి, నేను ఎవరితో ఆడుకోవాలి!(ఏడుపు ని ఆపుకుంటూ)
హరిణి: నీకు ఇంకా మంచి ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళు వచ్చాక ఇంక నన్ను మర్చిపోతావ్.
గౌతమ్: మళ్ళీ నిన్ను ఎలా కలవాలి?
హరిణి: ఎపుడైనా అమ్మమ్మ వాళ్ళింటికి వచ్చినప్పుడు కలుస్తా.
గౌతమ్: నువ్వు వచ్చావని నాకెలా తెలుస్తుంది?
హరిణి: హాహా, తెలుసుకోవాలి.
గౌతమ్ వాళ్ళ ఊరిలో ఆ సంవత్సరం పోలేరమ్మ అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి. నిప్పులు మీద చాల మంది నడవటం చూశాడు మొదటిసారి. ఎందుకలా నడుస్తున్నారని నాన్నమ్మ ని అడిగాడు. మనసులో ఒక కోరిక కోరుకుని అది తీర్చమని అమ్మ ని అడగడానికి అలా నడుస్తారని చెప్పింది. నేను కూడా నడుస్తానని అడిగాడు. ఆమ్మో వద్దు, కాళ్ళు మాడిపోతాయి. వాళ్లంటే పెద్ద వాళ్ళు. నువ్ చిన్నపిల్లాడివి కాళ్ళు తట్టుకోలేవ్.
నేను నడుస్తా అంతే అంటూ పరిగెత్తుకుని నిప్పుల మీద నడిచేసాడు గౌతమ్. అక్కడ ఉన్నవాళ్ళంతా పెద్దగా కేకలు వేశారు. పిల్లాడిని పట్టుకోండి అంటూ. వెంటనే ఒకతను పట్టుకుని పక్కకి లాగేసాడు.
కందిపోయిన కాళ్ళతో ఇంటికి నడవలేకపోయాడు గౌతమ్. వాళ్ళ తాత సైకిల్ పై ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చాడు. వాళ్ళ నాన్నమ్మ కాళ్ళకి కొబ్బరి నూనె రాసింది.
అందరూ మొండివాడు, చేయ్యోద్దన్న పనే చేస్తాడు అని చాలా అనుకున్నారు. కానీ గౌతమ్ మాత్రం "అమ్మ! నేను అది చేయలేకపోయాను, కానీ నా మొదటి కోరిక తీర్చు. హరిణి ని వెళ్లకుండా ఆపు" అని కోరుకున్నాడు.
ఆ మరుసటి రోజే ఒక బంధువు సాయి కోటి రాయడం చూసాడు గౌతమ్. ఎందుకు రాస్తున్నారని అడిగాడు. మనసులో ఒక కోరిక కోరుకుని అది తీర్చమని అడగడానికి రాస్తున్నానని చెప్పారు. అంతే తనకు ఒక సాయి కోటి రాసుకునే పుస్తకం తెప్పించమని నాన్నమ్మ తాతలకి ఆర్డర్ వేసాడు గౌతమ్. అడిగిన గంటలో బుక్ అతని చేతిలోకి వచ్చింది.
గౌతమ్ కి తెలిసింది ఒకటే. పుస్తకం ముగిస్తే తాను అనుక్కున్నది జరుగుతుంది. ఎప్పుడూ పుస్తకం ముగించడం పైనే దృష్టి. ఒకరోజు గౌతమ్ వాళ్ళ ఇంటికి బంధువు ఒకరు వచ్చారు. గౌతమ్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ పుస్తకం రాస్తున్నాడు. ఆవిడ చెప్పారు "సాయి కోటి అనేది చాలా ఓర్పు గా రాయాలి. స్నానం చేసి మనసు దాని పై లఘ్నం చేసి మనసు లో కోరిక ని తలుచుకుంటూ రాయాలి. అంతే కానీ టీవీ చూస్తూ సరదాగా రాసేది కాదు." అప్పటినుంచి రోజు ఉదయం 2 గంటలు సాయంత్రం 2 గంటలు గుడికి వెళ్లి గుడిలో రాసేవాడు గౌతమ్. వేసవి సెలవులకు చెల్లి హైదరాబాద్ వెళ్తుంటే, తనని కూడా రమ్మని అత్త వాళ్ళు పిలుస్తుంటే "పుస్తకం అవ్వకుండా నేను ఎక్కడి వెళ్ళను" అని చెప్పేసాడు గౌతమ్. కొన్ని రోజులకు సాయి కోటి పూర్తయింది. అన్ని పుస్తకాలను షిరిడి కి పంపించబోతున్నారు. అందరు తమ తమ కోరికలను పుస్తకం పై కాగితం పై రాసి హుండీ లో వేస్తున్నారు. "హరిణి వెళ్లకుండా చూడు స్వామి" అని రాసి హుండీ లో వేసాడు గౌతమ్.
50 రోజుల తరువాత.
స్కూల్ బస్సు వచ్చి ఆగింది. ఎక్కిన వెంటనే ముందు హరిణి కోసం వెతికాడు గౌతమ్. తను లేదు. వెళ్లిపోయిందని అర్ధం అయ్యింది. దేవుళ్లందరిని తిట్టుకున్నాడు. స్కూల్ మొదలైన మూడవ రోజు బస్సు లో హరిణి కనిపించింది. తన ఆనందానికి అవధులు లేవు. నవ్వుతూ తన ఎదురు నిలబడ్డాడు.
గౌతమ్: వెళ్లలేదా!
హరిణి: బదిలీ కుదర్లేదు. మళ్ళీ ప్రయత్నించాలి.
గౌతమ్: ఓహో. (మనసులో చెప్పలేనంత ఆనందం)
స్కూలుకి వెళ్లిన తరువాత పిడుగు లాంటి వార్త. గౌతమ్, హరిణి వేరు వేరు సెక్షన్లు. దుఖ్ఖము ఆపుకోలేకపోయాడు. ఇంటర్వెల్ లో హరిణి వాళ్ళ సెక్షన్ కి వెళ్ళేవాడు. కానీ తాను మాట్లాడడం మానేసింది. బస్సు లో మాట్లాడుతుందేమో అని దగ్గర్లో కూర్చునేవాడు. కానీ ఎలాంటి ఉపయోగం లేదు.
తరువాత తరగతి లో అమ్మాయిలు వేరు, అబ్బాయిలు వేరు. ఇక కలిసే అవకాశం లేదు అని అర్ధమయింది గౌతమ్ కి. తను చూసినా, తాను చూడడం మానేసింది. కళ్లెదుటే వున్నా స్నేహితుడు/స్నేహితురాలు మాట్లాకపోతే అది నరకం తో సమానం. ఒక రోజు బస్సు లో మాట్లాడదామని పలకరించాడు. ముఖం పక్కకు పెట్టుకుని వెళ్ళిపోయింది.
పదోవ తరగతి లో వాళ్ళ స్కూల్లో అమ్మాయిలూ అబ్బాయిలూ వేరు వేరు అంతస్తులలో చదువుకుంటారు. కావున ఇక తనతో మాట్లాడే అవకాశం రాదేమో అని చాలా బాధపడ్డాడు. కానీ ఆ ఏడాది వాళ్ళని కలిపి కూర్చోపెట్టారు ఒకే సెక్షన్లో. ఒకసారైనా మాట్లాడుతుందేమో అనే ఆశతో మొదటి రోజు నుంచి ఎదురుచూడసాగాడు. కానీ అటు వైపు నుంచి ఎలాంటి కదలిక లేదు. కానీ చావని ఆశతో ఎదురు చూడటం ఆపలేదు.
కొన్ని మాసాల తరువాత, హరిణి వాళ్ళ అమ్మ గారికి బదిలీ అయ్యింది. పదవ తరగతి మధ్యలోనే తను స్కూల్ విడిచి వెళ్ళిపోయింది. గౌతమ్ జీవితంలో చీకట్లు కమ్ముకున్నాయి. క్లాస్ లో తను కుర్చుంనే చోటు చూసినప్పుడల్లా కళ్ళల్లో జలపాతాలు పారేవి. హాజరు లో తన సంఖ్య విన్నప్పుడల్లా గుండెల్లో నొప్పి పుట్టేది. ఏడ్చాడు. ఏడ్చాడు. కొన్నాళ్ళకు మాములు అయ్యి పబ్లిక్ పరీక్షలకి చదవడం మొదలు పెట్టాడు. ఇక అంతలోనే ఒక ఓదార్పు. పబ్లిక్ పరీక్షలు రాయడానికి హరిణి మళ్ళీ స్కూల్ కి వస్తోందని. తన హాల్ టికెట్ ఆ స్కూల్లోనే ఉంది మరీ. మాట్లాడదని తెలిసినా కనీసం కళ్లెదుటే ఉంటుందన్న ఆనందం. వచ్చిన నాలుగు రోజులకే మళ్ళీ సెక్షన్లు మార్చేశారు. పరిస్థితులు పగపడితే దేవుడైన ఏమి చేయలేడు మనుషులం మనమెంత, తలొంచక తప్పదు కదా.
పరీక్షల చివరి రోజున అమ్మవారి దర్శన భాగ్యం కలిగింది. మాట్లాడదామని అడుగు వేసే లోపే తుర్రుమంది. మరుసటి రోజు నుంచి వేట మొదలైంది. తాను ఏ కాలేజ్ లో చేరొచ్చని ఒక చిన్న సైజ్ రీసెర్చ్ మొదలుపెట్టాడు. దాదాపు నెల రోజుల తర్జన భర్జనల తరువాత విజయవాడ శ్రీ చైతన్య బైపీసీ అని ఫిక్స్ అయ్యాడు. ఇక తను అక్కడే వాలిపోయాడు కనిపించకపోతుందా అనే ఆశతో. ఎప్పుడు ఔటింగ్ ఇచ్చినా బీసెంట్ రోడ్ సెంటర్ లో ప్రతి గల్లీ లో వెతికేవాడు. లెనిన్ సెంటర్ రోడ్ లో, ఐమాక్ దారుల్లో, రామవరప్పాడు రింగ్ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, బెంజ్ సర్కిల్, నిర్మల కాన్వెంట్ రోడ్ ప్రతిదీ తిరిగేవాడు. కనకదుర్గ గుడికి వస్తుందేమో అని ఒక రెండు ఔటింగ్ లు అక్కడే గడిపాడు. కానీ తన జాడ లేదు. ఒకరోజు కాలేజీ కి వస్తుంటే ట్రైన్లో ఒక ఫ్రెండ్ కనిపించింది. వెళ్లి అడుగుదామనుక్కునాడు హరిణి గురించి.కానీ పక్కన వాళ్ళ నాన్న గారు కూడా ఉండడంతో ఎందుకు లే అని వెనక్కి తగ్గాడు. పరీక్షా కేంద్రాలను కూడా వదిలేవాడు కాదు. దగ్గర్లో వున్నా ప్రతిదానికి వెళ్లి వెతుకుతుండేవాడు. పక్కన ఏ కాలేజీ అమ్మాయిల బస్సు వచ్చినా కళ్ళు ఆర్పకుండా వెతికేవాడు. సెలవులు ఇచ్చే రోజు అయితే కృష్ణ ఎక్సప్రెస్ లో ప్రతి సీట్ వెతికేవాడు. కానీ తను ఎక్కడా కనిపించలేదు.
ఇంటర్మీడియట్ అయిపోయిన తరువాత c లాంగ్వేజ్ కోర్స్ జాయిన్ అయ్యాడు గౌతమ్. అక్కడ అనుకోకుండా పరిచయం అయ్యింది హరిణి బెస్ట్ ఫ్రెండ్ వెన్నెల. ఒకసారి క్లాస్ లో వెన్నెల ఫేస్బుక్ వాడటం గమనించాడు గౌతమ్. ఆ రోజే క్లాస్ అయిపోయిన తరువాత ఒక ఫేస్బుక్ అకౌంట్ తీసుకుని ముందు వెన్నెల కే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. తను కూడా వెంటనే అంగీకరించింది. ఇక మొదలైంది.
గౌతమ్: హాయ్ వెన్నెల!!!
వెన్నెల: హెల్లొ గౌతమ్.
గౌతమ్: ఎలా వున్నావ్?
వెన్నెల: రోజు క్లాస్ లో చూస్తూనే వున్నావ్ గా.
గౌతమ్: సర్లే, ఏమి చేస్తున్నావ్?
వెన్నెల: స్నాక్స్ తింటూ, టీవీ చూస్తున్నా.
గౌతమ్: ఏమి చూస్తున్నావ్?
వెన్నెల: హిందీ సీరియల్ లే
గౌతమ్: ఓహో! ఇంకా...
వెన్నెల: ఏముంటాయి?
గౌతమ్: మీ ఫ్రెండ్ ఎం చేస్తుంది?
వెన్నెల: ఎవరు?
గౌతమ్: మీ బెస్ట్ ఫ్రెండ్.
వెన్నెల: అదే, పేరు లేదా?
గౌతమ్: హరిణి.
వెన్నెల: నీకు ఎందుకు తన గురించి?
గౌతమ్: ఊరికే, ఫ్రెండ్ కదా.
వెన్నెల: నాకు తెలీదు.
గౌతమ్: చెప్పొచ్చు కదా!
వెన్నెల: నాకు నిజంగా తెలీదు.
గౌతమ్: ప్లీజ్.
వెన్నెల: మా అమ్మ తో బైటకి వెళ్తున్నా. బై.
Comments
Post a Comment