నా కళల రాకుమారికి_1
ఏ దిక్కున దాక్కున్నావ్!!! ఏ గడియన కన్నుల్లో పడతావ్!!!
నీ కోసం ఎదురుచూస్తుండగానే యుగాలు గడిచిపోతున్నాయి. ఇంకెంత కాలం నీ కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూడాలి!!!
ఎదురు చూసి చూసి కళ్ళు వాచిపోతున్నాయి... ముఖం పీక్కుపోతుంది... గుండె బరువెక్కిపోతుంది...
ఎప్పుడు ప్రసాదిస్తావ్ నీ దర్శన భాగ్యాన్ని!!!
ఇంకెన్నాళ్లు నేను ఆ మాహిష్మతి రాజ్యంలో దేవసేన లాగా నిప్పులని శ్వాసగా చేసుకుని బ్రతకాలి !!!
నీకు కూర లో వేసే ఉప్పు అంత అయినా జాలి కలగడం లేదా నా పైనా!!!
రోజులు గడిచిపోతున్నాయి ... గంటలు కరిగిపోతున్నాయి ... నిమిషాలు అంతమైపోతున్నాయి ... క్షణాలు ఆవిరైపోతున్నాయి... కానీ నీ జాడ మాత్రం కనిపించడం లేదు.
కరుణించు...
కనికరించు...
ఇకనైనా నీ దర్శన భాగ్యం ప్రసాదించు...
ఉదయానే కళ్ళు తెరిచిన మరుక్షణం నీ ముఖారవిందాన్ని చూసి... ఆహా! ఏమి నా భాగ్యమని ఉప్పొంగిపోవాలనుంది... నువ్వు లేచే వరకు నిన్ను అలానే చూస్తుండిపోవాలనుంది...
నువ్వు లేచే సమయానికి నేను ఇంకా లేవనట్టుగా నటించి ... నువ్వు నుదుట పై పెట్టె ఆ ముద్దు ని ఆస్వాదించాలనుంది...
ఆ పై వంట గదిలో నువ్వు కాఫీ కలుపుతుంటే వెనుక నుంచి పిల్లిలా మెల్లగా వచ్చి వాటేసుకుంటే:
"అబ్బబ్బా! ఇంట్లో ఉన్నంతసేపేమో కొంగు వదలవు... బయటకి వెళితే త్వరగా రావు అని నువ్వు తిడుతుంటే" ఏమి కావాలి అంతకంటే ఈ జీవితానికి.

ఇంటి ముందు నువ్వు అందంగా ముగ్గు వేస్తుంటే ... ఆకాశానికే అసూయ కలుగుతుంది.
తులసి మొక్కకు నువ్వు పూజ చేయడం చూసి తులిప్ వనం కన్నీరు కార్చక ఉండగలదా!!!

నిశ్శబ్దం అలుముకున్న నా ఇంటిలో నీ కాలి మెట్టెల సవ్వడి కంటే వినసొంపైన సంగీతం ఇంకేం ఉంటుంది.
నీ నుదుటున బొట్టే నాకు అందం.
నీ మాంగల్యమే నాకు రక్షణ కవచం.
నీ ఐదో తనమే నా ప్రాణం.
నువ్వు తలారా నీళ్లు అంటుకుని, కురులని విరభూసుకుని, తడి పాదాలతో మన ఇంటి గచ్చు పైన నీ పాద ముద్రలను వేసుకుంటూ పాపలా నడిచి వస్తుంటే నిన్ను ముద్దాడకుండా ఎలా ఉండగలను!!!
నాలోని విరహాగ్నిని నిప్పులుగా చేసి నీ కురులకు కాపడం పడుతుంటే, ఆ నీటి బొట్టులు నీ నున్నని నడుము నెలవంక పై పడి మెల్లగా కిందకి జారుతుంటే, ఎదో సాయం చేద్దామని నేను తుడుస్తుంటే దాన్ని నువ్వు అపార్థం చేసుకుని నా చేతి పై గిల్లితే, ఆ నొప్పికి నేను అరిస్తే మా అమ్మ పరుగున వచ్చి ఏమైంది రా అంటే ఏమి చెప్పాలో తెలియక నేను సతమతమవుతుంటే... అర్ధం చేసుకుని మా అమ్మ మూసి మూసి నవ్వులు నవ్వుకుంటుంటే అంతలో మా నాన్న ఏంటి ఆ అరుపు అని అడిగితే... మా అమ్మ మూసి మూసి నవ్వులు... నువ్వేమో తల పక్కకు తిప్పుకుని సిగ్గు పడుతుంటే ఒక వెర్రి బాగులు పేస్ ఎక్స్ప్రెషన్ తో మా నాన్న కి సమాధానం చెప్పాల్సింది నేనే కదా ఎలాగూ...
నిన్ను విడిచి ఆఫీస్ కి వెళ్లడం ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా!!! ఆ బాధ వర్ణణాతీతం...
కానీ నువ్వు ప్రేమని కుక్కి కుక్కి పెట్టిన ఆ లంచ్ బాక్స్ తో నీ ప్రేమని నాతో తీసుకెళ్తా...
నీ వంటల ఘుమఘుమలు తగిలి ఆఫీసులో అందరూ నన్ను చూసి కుళ్ళుకుంటుంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా!!!
నిన్ను చూడటానికి ఆఫీస్ నుంచి పరుగున ఇంటికి వస్తే "ఇవ్వాళ కూడా పువ్వులు తీసుకురాలేదా?" అని నువ్వు బుంగ మూతి పెట్టుకుంటే నిన్ను బుజ్జగించడం, లాలించడం ఎంత ముద్దుగా ఉంటుందో!!!
ఆ జాబిలి వెలుగులో నీ వడిలో పడుకుని, చంద్రబింబం లాంటి నీ మోము ని చూస్తూ కష్ట సుఖాలు పంచుకుంటూ, ఒకరికి ఒకరు దైర్యం చెప్పుకుంటూ, భవిషత్తు గురించి ఆలోచిస్తూ, పొదుపు మార్గాలు చర్చించుకుంటూ, తర్వాతి నెలలో ఖర్చులు ఎలా తగ్గించుకోవాలో ఆలోచిస్తూ గడిపే ఆ సమయం మన వృద్ధాప్యం లో ఎంతో మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
మన పెళ్లి తంతు అంతా నాకు రోజు కలలో వస్తూనే వుంది. పెళ్లి పీటల పైన ఒకరికి ఒకరం గిల్లుకోవడం. మూడు ముళ్ళు వేసేటప్పుడు నా గోలలో నేనుంటే ఎవరికీ కనపడకుండా మెల్లగా నా గడ్డం పైన ముద్దు పెట్టేశావ్. కరెంటు పోయినపుడు అందరూ కంగారు పడుతుంటే నా బుగ్గ పైన ముద్దు పెట్టి ఆ తరువాత ఎందుకు కొరికావ్. రాక్షసి . ఆ తరువాత మీ తమ్ముడు చెప్పాడులే నువ్వే ఒక పది సెకన్ల మీటర్ ఆపమని చెప్పావంటగా. పెళ్లి అయిపోతుందనగా భోజనాలు ఐపోతాయేమో అని నీ భయం. నా పెళ్లిలో నేను మెక్కకపోతే ఎలా అనే నీ పొగరు. తినిన తరువాత నువ్వు బొడ్డులో దాచుకున్న నీ పైట కొంగు ని తీసుకుని మూతి తుడుచుకుని రొమాంటిక్ ఫెల్లౌని అని నేను గర్వంగా వెళ్తుంటే నువ్వు మళ్ళీ పిలిచి ఎక్కడ తీసిన వస్తువు మళ్ళీ అక్కడే పెట్టాలని తెలీదా అని మళ్ళీ నాచేత పెట్టించి నా గర్వాన్ని అణిచేసావ్.
వీటన్నింటిని ఎంత త్వరగా ఆస్వాదిద్దామా అనిపిస్తుంది!!!
నీదే ఆలస్యం.
నీ కోసమే నా ఎదురుచూపులు...





Comments
Post a Comment