అక్కా- నీకు నా పాదాభివందనం
లక్షలుగా ఉన్న నక్షత్రాలు...
అందున ఒకానొక సౌర కుటుంబం...
అందులో భాగమైన ఒక భూప్రపంచం...
దాని పైన
అయిదు మహాసముద్రాలు...
ఏడు సముద్రాలు...
నూట అరవై ఐదు ముఖ్య నదులు...
పదకొండు కోట్ల డెబ్భై లక్షల సరస్సులు...
మూడు వందల భారీ ఆనకట్టలు...
రెండు వందల దేశాలు...
ఆరు వేల ఐదు వందల భాషలు...
ఆరు కోట్లకు పైగా వంతెనలు...
అనంత కోటి జీవ రాశులు...
వాటిలో ఒకటైనది మన మానవ జన్మ...
ఎనిమిది వందల కోట్ల జనాభా తో ఏడు ఖండాలుగా విడిపోయి, విడి విడి ఆచార వ్యవహారాలతో, తిండి అలవాట్లతో, కట్టు బొట్లతో, కట్టుబాటులతో కలిసి బ్రతుకుతుతున్న ఒక జీవ రాశి మనం.
మనిషి:
రెండు వందల ఆరు ఎముకల...
ఎనిమిది వందల నలబై కండలతో...
వెయ్యి కోట్ల అణువులతో ఆ కనిపించని భగవంతుడు సృష్టించిన ఈ మానవ శరీరంలో ముఖ్యమైన రెండు శరీర భాగాలు: బుర్ర, మనస్సు.
బుర్ర తెలివినిస్తుంది. ఆ లెక్కన చూసుకుంటే డాల్ఫిన్ల తరువాత ఈ ప్రపంచంలో అతి తెలివైన వాళ్ళం మనమే. కంప్యూటర్, మొబైల్, టీవీ, ఇంటర్నెట్, స్టెతస్కోప్, విమానం, రైలు, లైట్ అంటూ లెక్కలెన్నని కనుగొన్నాం.
ఇక పోతే మనస్సు. పట్టుకుంటే గుప్పెడంత ఉంటుంది. కానీ అందులో ప్రేమ, ద్వేషం, జాలి, కోపం, కృతజ్ఞత, కుళ్ళు, ఆరాధన, కామం అన్ని నిక్షిప్తమైఉంటాయి. మరీ పచ్చిగా చెప్పాలంటే మన మనస్సు ఒక్కోసారి మనకే అర్ధం కాదు.
మనుషుల్లో మొదటి చీలిక: ఆడ, మగా.
దేవుడు ముందుగా మగ వారిని సృష్టించి, వారిలోని లోపాలను పరిశీలించి, వాటిని తొలగిస్తూ ఆడవారిని తయారుచేసాడని చెప్తుంటారు.
ఆడ అనే మనిషి కి ఏర్పడే మానవ సంబంధాలు: ముందుగా కూతురు అవుతుంది, ఆ తరువాత సోదరి, స్నేహితురాలు, ప్రేయసి, భార్య, కోడలు, వదిన, పిన్ని,అత్త, అమ్మ, అమ్మమ్మ, నాన్నమ్మ, బామ్మ.
అమ్మ గురించి చెప్పాలంటే భాష చాలదు.
భార్య గురించి చెప్పమంటే ప్రతి ఒక్కడు కవి అయిపోతాడు.
కూతురు గురించి చెప్పడానికి నా దగ్గర అనుభవం లేదు.
ఇక మిగిలింది సోదరి: అక్క లేదా చెల్లి.
చెల్లి అయితే మనల్ని ఏడిపిస్తుంది, అక్క అయితే మనం ఏడిపించచ్చు.
చెల్లి అయితే మనం జాగ్రత్తగా చూసుకోవాలి, అక్క అయితే మనల్ని చూసుకుంటుంది.
చెల్లి అయితే మనం రాజీ పడాలి, అక్క అయితే మనకోసం తనే పడుతుంది.
అంతే కాదు పైన చెప్పినవన్నీ చేస్తుంది కూడా...
లాలించడంలో అమ్మ,
కాపాడటం లో నాన్న,
ముద్దుచేయడంలో అమ్మమ్మ,
అనురాగంలో పిన్ని,
ఆప్యాయతలో వదిన,
కవ్వించడంలో అత్త,
కష్టంలో తోడుగా నిలవడంలో భార్య,
ఎల్లప్పుడూ మేలు కోరుకునే స్నేహితురాలు,
అక్కా... తొక్కా.
అక్కా... కుక్కా.
అక్కా... నక్కా.
అని చిన్నప్పుడు ఎంత ఏడిపించినా ముద్దు ముద్దు మాటలని మురిసిపోయేంత పిచ్చితనం తనది.
మనం కోపం చూపించినా, తిరిగి ప్రేమ మాత్రమే చూపించగలిగిన అమాయకత్వం తనది.
మనం చూపించే కొద్దిపాటి ప్రేమకే మురిసిపోయే పసితనం తనది.
తను బాధల్లో వున్నాకూడా, మనకి తెలియనివ్వని నాన్నతనం తనది.
తమ్ముడికి- కొడుక్కి, చెల్లి కి- కూతురుకి తేడా తెలియని అమ్మతనం తనది.
గంపెడంత ఆశలు, కొండంత ఒత్తిడి, కలిసిరాని పరిస్థితులు - ఇవే తన ప్రియ నేస్తాలు.
బాధల్లో ఉంటే ఓదారుస్తుంది అమ్మ, అలాంటి అమ్మే కొట్టినప్పుడు ఓదార్చేదే అక్క.
దేవుడు అన్నీ చోట్ల ఉండలేక అమ్మని ఇచ్చాడు అంటారు. అంటే అమ్మే దేవుడు.
అలాంటి అమ్మ కూడా అన్నీ చోట్ల ఉండలేక అక్కని ఇచ్చింది. అంటే అక్క కూడా దేవుడే.
సాధారణంగా అమ్మ నాన్నలు ముద్దు పేర్లు పెడతారు,
అలాంటి పేరు ని కాదని తనే తనకి నచ్చిన పేరుతో పిలుస్తుంది.
తనే ముద్దు పేరు పెడుతుంది కూడా.
అంత హక్కు తీసుకుంటుంది మన మీద.
అమ్మ తరువాత అంత ప్రేమగా ముద్దలు కలిపి తినిపించేది తనే కదా మరి!!!
పాల గిన్నె తన ముందుంచితే పాలు తాగేసి, నీటిని వదిలేస్తుంది కొంగ.
అలానే కుటుంబ వ్యవహారాలన్నీ తన ముందుంచితే, బాధలని తను తీసుకుని, నవ్వులని మనకి ఇస్తుంది అక్క.
అమ్మ ప్రేమని ఇస్తుంది.
నాన్న ప్రేమని దాచుకుంటాడు.
భార్య మన నుంచి ప్రేమ కోరుకుంటుంది.
అక్క ప్రేమలో ముంచేస్తుంది.
అందుకే అమ్మ నాన్నలకి పోటీగా ముద్దులు పెడుతుంటుంది.
తనకి బాధని పోగొట్టడం తెలియకపోయినా, పంచుకోవడం తెలుసు.
చీకటిని తొలిగించడం తెలియకపోయినా, భయాన్ని పోగొట్టడం తెలుసు, ధైర్యం నింపడం తెలుసు.
కష్టాలను అడ్డుకోవడం తెలియకపోయినా, వాటి నుంచి కాపాడటం తెలుసు.
కన్నీటిని రానివ్వకుండా ఆపడం తెలియకపోయినా, వాటిని తుడవటం తెలుసు.
ఓదార్చడం తెలుసు, లాలించడం తెలుసు...
బుజ్జగించడం తెలుసు, బ్రతిమాలాడడం తెలుసు...
సహించడం తెలుసు, భరించడం తెలుసు...
నాట్యం తెలుసు, నవ్వించడం తెలుసు...
పాడడం తెలుసు, పడించడం తెలుసు...
ఆటలు తెలుసు, ఆడించడం తెలుసు...
తినడం తెలుసు, తినిపించడం తెలుసు...
ఆశలు తెలుసు, అవసరాలు తెలుసు...
పంచడం తెలుసు, పెంచడం తెలుసు...
ఆకలి తెలుసు, ఆలోచనలు తెలుసు...
ఆవేదన తెలుసు, నిస్సహాయత తెలుసు...
ఆదాయం తెలుసు, కర్చు తెలుసు...
నవ్వు తెలుసు, ఏడుపు తెలుసు...
ప్రేమ తెలుసు, అనురాగం తెలుసు...
ఆప్యాయత తెలుసు, ఆత్మీయత తెలుసు...
జాలి తెలుసు, క్షమించడం తెలుసు...
మనం ఎదుగుతుంటే నీడలా పక్కనే ఉండి రక్షించేది తనే.
చిన్నప్పుడు ఏడుస్తుంటే తన బొమ్మలు ఇచ్చి ఆడించేది,
పడుకునేటప్పుడు ఉయ్యాల ఊపేది,
అమ్మమ్మ లాల పోస్తుంటే పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకునేది,
ఆం తినడం నేర్పించేది, హోంవర్క్ చేసి పెట్టేది,
బొమ్మలు గీసి ఇచ్చేది, కథలు చెప్పేది, బట్టలు తొడిగేది, పౌడర్ రాసి జుట్టు దువ్వి అందంగా చేసేది,
బ్యాగ్ మోసేది, కొనుక్కోడానికి డబ్బులు ఇచ్చేది.


Comments
Post a Comment