డైరీ


నాకు ఊహ తెలిసిన దగ్గరనుంచి నన్ను అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తులు: హారిక భవాని, స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం, రాహుల్ ద్రావిడ్, శ్రీ శ్రీ, వాజపాయి, ధోని, లక్ష్మి భాయి, రాకేశ్ శర్మ, ఎల్ వి ప్రసాద్.


నా జీవితంలో నేను ఎల్లప్పుడూ ఋణపడి వుండే వ్యక్తీ: హారిక భవాని. 





ఎదో సాధించాలనే ఆశ. రాకేశ్ శర్మ గురించి చదివి నేను కూడా వ్యోయగామి అవ్వలనుకున్నాను. దానికి చాలా ఖర్చవుతుందని తెలిసి ఆలోచన మార్చుకున్నాను. రాకెట్ నుంచి కన్ను విమానం పైన పడింది. పైలట్ అయ్యి తీరాలి అనుకున్నాను. కానీ ఎలా అవ్వాలో అప్పటికి నాకు తెలిదు. రోజు పేపర్ చదవడం అలవాటు చేసుకున్నాను. అపుడు నాకు తెలిసింది బాపట్ల దగ్గర సూర్య లంక సమీపంలో ఒక ఎయిర్ ఫోర్సు స్కూల్ వుందని. ఆ స్కూల్లో సీట్ కోసం ప్రయత్నించాను. కానీ అప్పటికే ఆ సంవత్సరం అడ్మిషన్స్ అయిపోయాయి. తరువాతి సంవత్సరం ప్రయత్నించాను. ఎంట్రన్స్ టెస్ట్ రోజు పరీక్షకి ఎవరూ తీసుకెళ్ళలేదు. పైగా అలాంటివి మనకి సరిపోవు అని చిన్న చూపు చూసేవారు. పేపర్ బాగా చదివేవాడిని, చందమామ పుస్తకాలు బాగానే చదివేవాడిని కానీ, పాఠ్య పుస్తకాలంటే మాత్రం ఏకాగ్రత నిలిచేది కాదు. 

ఒకరోజు పేపర్ లో క్రిస్ బర్నార్డ్ గారి పైన ఆర్టికల్ చదివి ప్రభావితుడినై 
నేను కూడా కార్డిఓలోజిస్ట్ అవ్వాలనుకున్నాను. 
దానికి ముందు ఎంబీబీస్ చదవాలని, ఆలా చదవాలంటే ముందు నుంచి బయాలజీ బాగా చదవాలని తెలుసుకున్నాను.


కానీ చదువు పైన మాత్రం ఏకాగ్రత కనబర్చలేకపోయేవాడిని. 
ఎప్పుడైనా శుభకార్యాలకు బంధువులతో కలిసినపుడు అందరూ ఆ అబ్బాయి సరిగ్గా చదవడు అని చెప్తుంటే ఏమి చేయలేని నిస్సహాయత నాది. చదివేయాలని ఉంటుంది కానీ చదవలేకపోయేవాడిని. క్లాసులో ఒక డల్ స్టూడెంట్ అనే ముద్ర ఉండేది. లోలోపల ఎవరికీ చెప్పుకోలేని మాటలు చాలా ఉండేవి. 


చదువు సరిగా అబ్బక, ఇక చదువు మానేసి ఇంటి దగ్గరే ఏదైనా పని చేసుకుందామని నేను అనుకుంటున్నా రోజులలో నాకు పరిచయం అయిన ఒక అదృష్టం తను. జీవితం లో ఏమి చేయాలో స్పష్టత లేని నాకు ఒక దారి చూపించిన గురువు తను. చదువంటే బ్రహ్మ రాక్షసి కాదని తెలిసేలా చేసిన  ధైర్యం తను. అసహ్యం, తిట్లు మాత్రమే చూపించే నాపై తొలిసారి జాలి చూపించిన దేవత తను.


రామ కోటి రాశాక జీవితం లోకి వచ్చింది.
సాయి కోటి రాశాక వెళ్ళిపోకుండా వుంది.
శివ కోటి రాశాక నేస్తం అయింది. 


నాకు అప్పటివరకు ఏమి లేదో తెలిసొచ్చింది, నాకు తను మార్గదర్శి అయ్యింది. చదువంటే ఇష్టం కలిగించింది. చదువుకుంటే జీవితం బావుంటుందని చెప్పింది. ఎలా చదవాలో చెప్పింది. అర్థంకాని, తెలియని ఎన్నో విషయాలను తనను అడిగి తెలుసుకున్నాను. తననే స్ఫూర్తిగా తీసుకుని, తనలా అవ్వాలని కలలు కనేవాడిని. 
అంతా సాఫీగా సాగిపోతే జీవితం ఎందుకవుతుంది?
అనుకోని కొన్ని కారణాల వల్ల మా మధ్య దూరం ఏర్పడింది. తను మాట్లాడదు. నేను మాట్లాడితే ఇష్టం ఉండదు, పైగా కోపం. కళ్ళముందే మనం ఆరాధించే వ్యక్తి వున్నా మాట్లాడలేకపోవటం కంటే దరిద్రం ఇంకేం ఉంటుంది. 


అలానే మా పాఠశాల ప్రాయం గడిచిపోయింది. 
కాలేజీ లోకి అడుగు పెట్టాను. ఇక్కడ ఇంకొక ఎదురు దెబ్బ తగిలింది. ఎంబీబీస్ చేయాలి అని అనుకున్న నా ఆశలు ఆవిరైపోయాయి. ఎంపీసీ లో చేర్పించారు. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. 

హాస్టల్ లో రాత్రి రూంలో అందరూ పడుకున్న తరువాత చాలా ఏడుపొచ్చేది. అందరి లానే నేను కూడా ఫ్యామిలీ ని మిస్ చేసుకోవడం వల్ల అనుకునేవాడిని. కానీ సెలవలకి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా రాత్రి ఏడుపొచ్చేది. అపుడు అర్ధం అయ్యింది అది డాక్టర్ కాలేకపోతున్నాన్న బాధ వల్ల అని. 

ఇంటర్ చదువుతున్న రెండు సంవత్సరాలు హారిక ఆచూకీ కోసం చాలా ప్రయత్నించా. కానీ లాభం లేదు.


ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం లో తన స్నేహితురాలిని అడిగి తన వివరాలు తెలుసుకున్నా. రోజు పడుకునేముందు తన ఫేస్బుక్ ప్రొఫైల్ ఓపెన్ చేసి, తన పేరు ని చూసి యాడ్ ఫ్రెండ్ పైన క్లిక్ చేద్దామా అని ఆలోచించి, బ్లాక్ అయితే కనీసం ప్రొఫైల్ చూడడానికి కూడా అవకాశం ఉండదని సంవత్సరం అంతా అలానే గడిపేశాను. 




అది డిసెంబర్ మాసం. 

చలి, దోమలు ఒకదానితో ఒకటి పోటీ పడుతుంటాయీ. ఎప్పటిలానే ఆ రోజు  కూడా వైఫై కోసం రాత్రి పది దాటిన  తరువాత  మా  కాలేజీ  బ్యాంకు  దగ్గరకు  వెళ్ళాను.

 దోమలు చుట్టుముట్టాయి. సినిమాలు డౌన్లోడ్స్ పెట్టి,మొబైల్ జేబులో పెట్టుకుని  అటు ఇటు తిరుగుతున్నాను.

దోమలు చుట్టుముడుతున్నాయి.

సెల్ల్ఫోన్ స్క్రీన్ ఆన్ చేస్తే చేతులు పీక్కుతినే పరిస్థితి.  
సమయం అర్థ రాత్రి 12 కావచ్చింది. 

వెళ్లేముందు తన ప్రొఫైల్ చూద్దామని ఫేస్బుక్ తెరిచా. 
అది చలి ప్రభావమో, దోమల మహిమో ఇంకేమిటో తెలియదు 
కానీ ఆ రోజు తనకి యాడ్ ఫ్రెండ్ పై క్లిక్ చేసి రిక్వెస్ట్ పెట్టేసాను. తీసేద్దాం, ఎందుకొచ్చిన గొడవ, మళ్ళీ తను బ్లాక్ చేస్తే  ప్రొఫైల్  చూడడానికి  కూడా  ఉండదని గుండె చెప్తున్నా, ఎం పర్లేదు, ఇంకొక అకౌంట్ ఓపెన్ చెయ్యొచ్చు లే అనే ధీమా. 


ఒక్కోసారి మనం చిన్నప్పుడు కథల్లో విని వుంటాం. కొందరికి అదృష్టం కాటేస్తే రాత్రికి రాత్రే కోటిశ్వరులు అయిపోయారని. అలాంటిదే  జరిగింది నా జీవితంలో కూడా. తెలిసి చేసిందో, నిద్ర మత్తులో చేసిందో, ఇగ్నోర్ చేయబోయి చేసిందో తెలియదు కానీ, తను నా ఫ్రెండ్ రిక్వెస్ట్ ఆక్సెప్ట్ చేసింది. 

చలి, దోమలు, హార్మోన్స్ అన్ని కలిసి ఒక పెద్ద ఈల వేసా. అక్కడితో ఆగితే ఇంత చెప్పాల్సిన అవసరం ఏముంటది. వెంటనే హాయ్ అని మెసేజ్ పెట్టేసా. అటు వైపు నుంచి కూడా హాయ్ అని సమాధానం. అపుడు మొదలైంది ప్రశ్నల చిట్టా. అసలు తనేనా మెసేజ్ చేస్తుంది లేక ఇంకెవరైనా నా!! అవేవి ఆలోచించే సమయం లేదు బుర్రకి. హార్మోన్స్ అన్ని తల నుంచి అరికాలు వరకు ఆకలి తో ఉన్న చిరుత పులి లా పరిగెడుతున్నాయి. ఇంక వెంటనే ఎలా వున్నావని ఇంకో మెసేజ్ నొక్కేశా. ఫైన్ అని అటు నుంచి సమాధానం. అంతలో వాచ్ మ్యాన్ వచ్చాడు. టైం అయిపోయింది, ఇక హాస్టల్ కి వెళ్ళకపోతే కంప్లయింట్ రాస్తా అంటున్నాడు. అలా నేనే ముందు గుడ్ నైట్ చెప్పాల్సొచ్చింది. కానీ ఆ మెసేజెస్ ని స్క్రీన్షోట్  తీసి  పెట్టుకున్నా. 

రూంకి వెళ్లిన తరువాత సినిమా చూడాల్సిన నేను, ఆ స్క్రీన్ షాట్ ను చూస్తూ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయేంత వరకూ చూస్తూనే వున్నా. తరువాతి రోజు క్లాసులో కూడా అదే చూస్తూ గడిపేసా. ఫ్రెండ్ దగ్గర హాట్స్పాట్  ఆన్ చేయించుకుని ఆక్టివ్ 8 హౌర్స్ ఎగో అని, మళ్ళీ ఆన్లైన్ కి ఎప్పుడొస్తుందా అని ఆత్రుత గా ఎదురుచూసేవాడిని. 

ఆ తరువాత తనకి మెసేజ్ చేయడానికి నాకు దొరికిన ఒక అవకాశం: న్యూ ఇయర్ 2014. సీనియర్స్ అంతా ర్యాగింగ్ చేస్తూ డాన్స్ లు వేయిస్తున్నారు. అక్కడ నుంచి తప్పించుకుని, తన కోసం మళ్ళీ బ్యాంకు దగ్గరకి వెళ్లి 12 గంటల వరకు ఎదురు చూసి హ్యాపీ న్యూ ఇయర్ అని మెసేజ్ చేశా. థాంక్ యు, సేమ్ టు యు అని సమాధానం. ఏమి కావాలి ఇంతకన్నా జీవితానికి. 

Comments

Popular posts from this blog

తెలుగు సామెతలు

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక అద్భుతమైన లేఖ ఇది.

12-February-1995